Revanth Reddy: "కాంగ్రెస్ కుల గణన సర్వే అత్యంత పారదర్శకంగా..! 1 y ago
TG : గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి తీరుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఎవరూ బీసీల లెక్కలు తీయలేదన్నారు. బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ పాద యాత్రలో కులగణన చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రాహుల్ హామీ మేరకు సీఎంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నానని తెలిపారు.
దేశంలో ఏ సీఎం చేయలేని సాహసానికి పూనుకున్నా అని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు అధికారికంగా ప్రకటించలేదన్నారు. కేసీఆర్ సర్వేలో తప్పులు ఉన్నాయి కాబట్టే లెక్కలు బయట పెట్టలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా కులగణన సర్వే చేసిందన్నారు. 150 ఇళ్లను క్లస్టర్ గా తీసుకుని వివరాలు సేకరించామని చెప్పారు. ఇంటి యజమాని స్వయంగా చెప్పిన లెక్కలే తమ సర్వేలో ఉన్నాయన్నారు. ఎంతో పకడ్బందీగా ఈ సర్వే నిర్వహించామన్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీలు కోర్టుకు వెళ్లి కులగణన ఆపాలని చూస్తున్నాయన్నారు. సర్వే వివరాలు కంప్యూటర్లలోనే కాదు.. బండిల్ రూపంలో కూడా ఉన్నాయని చెప్పారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల లెక్కలు రాత్రికి రాత్రే రాలేదన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే మోడీ వద్ద నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల సంఖ్యను కేసీఆర్ తగ్గిస్తే తాము పెంచామని చెప్పారు.