Jishnu Dev: తెలంగాణలో ప్రజలకే ప్రభుత్వం పాలన...! 1 y ago
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కలల సాకారానికే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతోందని, ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని తెలిపారు. అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో వ్యక్తులు కృషి చేశారన్నారు.
అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తూ, రైతుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు నేస్తం, రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు, వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, అదే విధంగా వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామని, ఇదే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని పేదలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకం కవరేజీ రూ.10 లక్షల వరకు అవకాశం ఇచ్చామని, అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం గేమే ఛేంజర్ గా మారిందని, దీని వలన మహిళలకు రూ.5005.95 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, అంతేకాకుండా అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అగ్రశ్రేణి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సివిల్ సర్వీసు పరీక్షల ఆశావహుల కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తీసుకొచ్చామని, ఇందులో భాగంగా అనేక మందికి గతేడాదిలో 55 వేల ప్రభుత్వోద్యోగాలు లభించాయని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రతిపాదించామని, అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం కూడా బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు.