Srisailam: శ్రీశైలం కెనాల్ ప్రమాదం: సహాయ చర్యలు ముమ్మరం..! 1 y ago
TG : శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమ వైపు సొరంగం వద్ద నాలుగు రోజులు క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నీరు నిలిచిపోయి మట్టి కూలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు, అధికారులు చిక్కుకున్నారు. కొంత మందిని కాపాడామని, మరో ఎనిమిది మంది ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు.
మంత్రులు ఉత్తమ్, జూపల్లి అక్కడికి చేరుకుని ఈ ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని చెప్పారు అధికారులు. వెయ్యి క్యూబిక్ మీటర్ల మేర రాళ్లు, మట్టి పేరుకుపోయాయని తెలిపారు. ప్రమాదం జరిగిన దృశ్యం భయానకంగా ఉందన్నారు. పనులకు నీరు అడ్డంకిగా మారిందని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.