Pawan Kalyan: 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు 1 y ago
AP: ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ..
వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు అని అన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పారు. మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వాళ్లకి ఆ హోదా దక్కేదని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండని అన్నారు. సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయండన్నారు. సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారని చెప్పారు. వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని వెల్లడించారు. సభకు రాగానే ఆందోళన చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. ఫిక్స్ అయిపోండి.. 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు అని స్పష్టం చేశారు. వాళ్లని అవమాన పరచాలనో.. తగ్గించాలనో కాదు అని తెలిపారు. ఆ హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ సభ్యులు ప్రవర్తించాలని అన్నారు. ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు జర్మనీ వెళ్లిపోవాలి అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.