TG Assembly: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ...! 1 y ago
TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ మొదటి రోజు కావడంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కానీ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజారంజక పాలన చేస్తున్నామన్నారు. కులగణన చేయడం సాహసోపేతమని, ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు.
బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ఈ రిజర్వేషన్లు అమలయ్యేలా బీజేపీ కూడా సహకరించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు కులగణలో పాల్గొనకుండా ఇప్పుడు బీసీ కులగణనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని, అదే విధంగా వరికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రైతు బంధు ఇచ్చి అన్నీ ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సరికాదన్నారు.