మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ధి సాధ్యం: చంద్రబాబు 1 y ago
AP : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవరం జరుపుకోవడం సామాజిక బాధ్యత అని, మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారని, వారి సాధికారత కోసమే టీడీపీ పని చేస్తోందని తెలిపారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని, ఈ ఏడాది లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పారు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉందని అందుకే ఒకప్పుడు హైదరాబాద్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం 35 ఎకరాలు కేటాయించామని చెప్పారు.
తాను రాజకీయాల్లో ఉండటం వలన డబ్బు సంపాదించలేకపోయానని, కానీ భువనేశ్వరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తూ, తనకు కూడా డబ్బులిచ్చే స్థాయికి ఎదిగారని చెప్పారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చామని, వారు ధైర్యం చేస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో 90 శాతం మహిళల జీతమే ఎక్కువ అని చెప్పారు. మహిళలు వ్యాపారాల్లో రాణించేందుకు 24 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, వారికి వ్యాపార లక్షణాలు నేర్పిస్తామన్నారు. మహిళలు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించే బాధ్యత తానే తీసుకుంటానని, ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా మహిళలు ఎదగాలని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగారని చెప్పారు.