Revanth: బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్....! 1 y ago
TG : ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాలను నిర్వహిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత రాజ్యంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని, వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది, ప్రభుత్వాలది అని తెలిపారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదని, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు.
గత ప్రభుత్వం 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించిందని, ఇది దురదృష్టకరమన్నారు. అదే విధంగా 2023లో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించాలని ప్రయత్నిస్తే కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవహేళన చేసిందని, కానీ గవర్నర్ వ్యవస్థను గౌరవించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు పాటించడం లేదన్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాలనే గవర్నర్.. సభలో ప్రసంగిస్తారని, ప్రభుత్వం చేసిన పనులనే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచామని చెప్పారు. పదేళ్లు పాలనలో ఉన్న వారికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు.
రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే అని, రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కలిగించామని చెప్పారు. అప్పుల కారంణంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని, వ్యవస్థలు, సంస్థలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ పాలన సాగిస్తోందని తెలిపారు.