Team India: టీమ్ ఇండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు 1 y ago
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ తో ఈనెల 20న దుబాయ్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో నూతన జెర్సీల్లో టీన్ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో తాజాగా పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, మహమ్మద్ షమీ తదితరులు నూతన జెర్సీలతో తాము మెగా సమరానికి సిద్ధమంటూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ జెర్సీలపై టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్థాన్ పేరు ఉంది. అయితే.. భారత జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు అభిమానులు డిమాండ్ చేయగా బీసీసీఐ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.
"టోర్నమెంట్ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది. ఆ ఆదేశాలను ఉల్లంఘించాలని మేము అనుకోవడం లేదు. జెర్సీలపై ఉండే ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ కు హక్కు ఉంటుంది" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టంచేశారు.