దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో హోలీ పండుగ...! 1 y ago
హోలీ.. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీపావళి తర్వాత దేశంలో కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. పురణాల్లో ఈ పండుగ గురించి అనేక రకాలుగా ప్రచురించారు.
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుని, అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరగా, దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే 'హోలీ' అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ 'హోలిక' దహనం నిర్వహిస్తారు.
కొన్ని దేశాల్లో ఈ పండుగను డోలోత్సవం లేదా డోలికోత్సవం అని పిలుస్తుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని కొందరి నమ్మకం. ఇక పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి 'డోలికోత్సవం' జరుపుతారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు.. రాధను ఊయాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు.