Green Wall: భారతదేశంలోనూ గ్రేట్ వాల్ – ఎక్కడ తెలుసా...! 1 y ago
ప్రపంచ ఏడు వింతల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకటి. ఈ గోడ అతిపొడవైన మానవ నిర్మితం. ఈ గ్రేట్ వాల్ పొడవు సుమారు 21,196 కిలోమీటర్లు. ఈ గోడ నిర్మాణం 1,800 సవంత్సరాలకు పైగా కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. అయితే ఇలాంటి గోడనే భారత్ కూడా నిర్మిస్తోంది. భారత్ నిర్మించే గోడ పొడవు సుమారు 1,400 కి.మీ ఉంటుంది. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకూ విస్తరిస్తుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాలను, ఆరావళి పర్వత శ్రేణిని మళ్లీ పచ్చగా మార్చడమే భారత ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి ఢిల్లీలోని మహాత్మగాంధీ సమాధి రాజ్ ఘాట్ వరకూ 1,400 కి.మీ మేర గ్రేట్ గ్రీన్ వాల్‌ను 2023లో ప్రారంభించారు. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్రప్రభుత్వం దీనిని నిర్మిస్తోంది. అయితే, ఇది మహాత్మగాంధీ జన్మస్థలాన్ని, ఆయన సమాధిని ప్రతీకాత్మకంగా అనుసంధానిస్తుందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానాలోని 27 జిల్లాల్లో ఇది విస్తరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ చెందుతాయని.. 5 కి.మీ వెడల్పు గల గ్రీన్ వాల్ కార్బన్ సింక్ లాగా పనిచేస్తుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్ "గ్రేట్ గ్రీన్ వాల్" నుంచి ప్రేరణ పొందింది.
మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో 78 శాతం కేంద్రం సమకూర్చనుండగా.. 20 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంది. 2 శాతం నిధులు అంతర్జాతీయ సంస్థలు సమకూరుస్తాయి. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయి తర్వాత 2030 నాటికి సుమారు 25 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించారలనే లక్ష్యం నెరవేరుతుందని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల దుమ్ము, కాలుష్యం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని వెల్లడించింది.